Friday, 26 June 2015

ఇరువదియైదవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియైదవ అధ్యాయము

దాము అన్నా కాసార్ (అహమదునగరు)

1. సట్టా వ్యాపారము 2. మామిడిపండ్ల కథ.

ప్రస్తావన

భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాధునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాధమహారాజుకు జయమగు గాక! సమస్త శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తులపాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగు గాక, జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి యున్నప్పుడు వానికోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణకలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సత్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతిమణి వంటిది. దానినుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.

భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖములనుండి, యపాయములనుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్ నగర నివాసియగు (ప్రస్తుతము పూనా వాసి) దామోదర్ సావల్ రామ్ రాసనె కాసార్ వురఫ్ దాము అన్నాకథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా

(దామోదర్ సావల్ రామ్ రాసనె)
6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవసందర్భమున ఇతనిగూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టీ వ్యాపారములు

1. ప్రత్తి
బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు రెండులక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యాబేరమును చేయుటయా? మానుటయా? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగ ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందరబట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా యిట్లనెను. "ఏమి వ్రాయుచున్నాడు? ఏమి యెత్తు వేయుచున్నాడు? భగవంతు డిచ్చినదానితో సంతుష్టిజెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము." బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు?" అనెను. బాబా యిట్లనియె: "ఓ శ్యామా! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు?"

అప్పుడు శ్యామా ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. "సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తన కున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము." శ్యామా జవాబును పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కని పెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైన దనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహింరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానమును కూడ బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డయొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు." బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము
పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ యాలోచనకూడ బాబా గ్రహించి యిట్లనెను. "నీవు 5 నేర్లచొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను"మనెను. కొన్నాళ్ళువరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువచేసినవారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టీవ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు.

ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో (కుండలో) పెట్టెను. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె" ననెను.

దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వాని కిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడ జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహప్రభావ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండుగంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లవైపు చూచుచూన్నారు. కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామూయే తిని చావవలెను." దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాళ్సాపతి (బాబా ముఖ్యభక్తుడు) దాని నిట్లు సమర్థించెను. "చావనునది యహంకారమునుగూర్చి. దానిని బాబాయందు చంపుట యొక యాశీర్వాదము." బాబా యతడి నిట్లనియె; "నీవు తినవద్దు, నీ చిన్నభార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును." దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి మహత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా యిట్లనెను. "సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధికూడ మాట్లాడును; కదులును. మనస్ఫూర్తిగ శరణుజొచ్చినవారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు."

ప్రార్థన

హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. "ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగ నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువలన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేముసంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."

నోటు:- దాము అన్నా యిచ్చిన వాఙ్మూలము ఈ సందర్భమున గమనింప దగినది.

ఒకనా డనేకమందితో నేనుగూడ బాబా పాదములవద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా యిట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడు చున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నాగురించి యడిగినది. బాబా భౌతికశరీరము విడిచిన పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్లు నడపగలను? అది యెటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి యేమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. "ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నే నక్కడనే యుండెదను." 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి. నా సోదరి చనిపోగా, నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా, వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పా కులకర్ని యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంపత్సరములనుండి యొక స్నేహితుడుండెను. అతడు నా భార్యయొక్క నగలపెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫోటోముందేడ్చితిని, ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపణ కోరెను.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియైదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

ఇరువదినాలుగవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

                                         శ్రీ

                              సాయిబాబా

                       జీవిత చరిత్రము

                                       ఇరువదినాలుగవ అధ్యాయము

బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల

1.హేమాడ్ పంతు 2.సుదామ 3.అన్నా చించణీకర్, మావిశీ బాయి - కథలు.

ప్రస్తావన

ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒకవిధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము, మన మహంకారరాహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతిసౌఖ్యములను పొందెదము. కాబట్టి యెవరయితే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హాస్యము, చమత్కారభాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాల సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతలపాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కథ

షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారమునాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా యెడమవైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టీ, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణ్ణా సాహెబుతో “నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము.” అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కాచేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందుభాగమును సాచెను. అందరికి ఆశ్యర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించయుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడ గ్రహించ లేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియె. “వీనికి (అణ్ణా సాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటిగలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది?”

హేమాడ్ పంతు:- బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. అయితే యీ దుర్గుణమును నాపై నేల మోపెదవు? ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నే నెట్లు తినియుందును? నాదగ్గరనున్న వారికి పెట్టకుండనే నెప్పుడేమియు తిని యెరుగను.

బాబా:- అవును అది నిజమే. దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?

నీతి

ఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియములకంటె ముందే, మనస్సు, బుద్ధి విషయానంద మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో, నిదికూడ ఒకవిధముగ భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియం దభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ ఆభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, నా వస్తువు ననుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచి పెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధిపొందును. శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము పృద్ధిపొందినపుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేద భావము లన్నిటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి. ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యేవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈవిధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్యాన మెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచసుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.

సుదాముని కథ

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులోకూడ ఇదేనీతి యున్నది. కనుక దాని నిక్కడ చెప్పుచున్నాము.

శ్రీ కృష్ణుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదాముడను వాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించు చుండిరి. శ్రీ కృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదామునికూడ అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి యిట్లనెను. “దాదా నాకు నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది.” సుదాముడు, “ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి” దనెను. కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. శ్రీ కృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తలయుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగ శ్రీకృష్ణు డిట్లనియె, “దాదా! యేమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది?”. సుదాము డిట్లనెను, “తినుట కేమున్నది? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కటకట మనుచున్నవి, విష్ణుసహస్రనామమును గూడ సరిగ ఉచ్ఛరించలేకున్నాను. ”ఇది విని సర్వజ్ఞుడగు శ్రీ కృష్ణుడిట్లనెను. “నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా? యనెను. అనగా తినుట కేమియు లేదని భావము. రెండవవాడు ‘తథాస్తు’అనెను. దాదా! యిది యొక స్వప్నము. నా కివ్వకుండ నీవేమి తినవని నాకు తెలియును.” స్వప్నప్రభావముచే నీ వేమితినుచుంటివని యడిగితిని. ” శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను. శ్రీ కృష్ణుని ప్రియ స్నేహితు డయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీ కృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను. ఎవరికయితే దగ్గరున్నవారు కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొన వలెను.

శ్రుతికూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి, ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబాకూడ దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను.

అణ్ణా చించణీకరు, మావిశీబాయి

హేమాడ్ పంతు ఇచట నింకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరె వురఫ్ అణ్నా చించణీకర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను, గాన్పించినను, వాడు మంచిహృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయునట్లే, యితడుకూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని (కఠడా పైన వేసియుండు దానిని) తోముచుండెను. కుడివయిపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. ఆమెను బాబా ‘అమ్మా’ యని పిలుచుచుండెను. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడి వారు. ఆమెకూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్చమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి, దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించు చుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా తోముచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అణ్ణా ముఖమునకు చాలదగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె యిట్లనెను. “ఓహో! యీ అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా?” యనెను. అణ్ణాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పై కెత్తి అతడిట్లనెను. “నేను ముసలివాడను దుర్మార్గుడ ననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుద్రువ్వుచున్నావు.” అక్కడున్న వారందరు ఈ ముసలి వాండ్రకలహమును జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి యీ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో “ఓ అణ్ణా! ఎందు కనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?” యనెను. బాబా మాటలు విని, యిద్దరు సంతుష్టి చెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి.

బాబా నైజము, భక్తపరాయణత్వము

బాబా తన భక్తులను వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే యింకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. “అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు”. ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొకచివరను స్తంభమునకు నాటించెను. సటకా యంతయు పొత్తికొడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్ది సేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దానికికూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపయి కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదినాలుగవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

ఇరువదిమూడవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదిమూడవ అధ్యాయము

(నాలుగువదినము పారాయణము – ఆదివారము)

యోగము – ఉల్లిపాయ

1. శ్యామా పాముకాటు బాగగుట. 2. కలరా నియమముల నుల్లంఘించుట. 3. గురుభక్తి పరీక్ష

ప్రస్తావన

నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సత్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గ మొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమ మయమగు భక్తి. గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను.

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతారపురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో దేనిలోనయిన పోటి పడెడి వారుకారు. తనకొరకేమైన చేయుమని యితరులను కోరెడి వారు కారు. సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుట గాని వారెరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని గాంచు చుండెడివారు. ‘నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.

మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన పుణ్యమేమైన యున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరుగదు. ఇక నీ యధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము.

యోగము – ఉల్లిపాయ

ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కరుతో షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నియు చదివెను. తుదకు పఠంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని, యనుభవమేమియు లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను. సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన తట్టెను. “రుచిలేని రొట్టెను పచ్చియుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు?” సాయిబాబా యతని మనస్సున నున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లునియెను. “నానా! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తికలదో వారే దానిని తినవలెను.” ఇది విని, యోగి యాశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్యశరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి జెంది యానందించినవాడై బాబా ఊదీప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను.

పాముకాటునుండి శ్యామాను కాపాడుట

ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు, జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింప బడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి, వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారిదృష్టి యన్నిటికంటె గొప్పస్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితు లాతని విఠోబాగుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్ధీపితుడయి బాబా యిట్లునయె, “ఓరి పిరికి పురోహితుడా! యెక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు” మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. “పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము.” బాబా యిట్లుకోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయ మందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను, శ్యామా దగ్గరకుపోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. “భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్యాస ముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు.” ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా వలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము గాని, తీర్థము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి. ఎవరైన ఈ కథగాని యింక నితరకథలుగాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.

కలరా రోగము

ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభచేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన – 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యీ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి, కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందుల కయి వారికి కట్టె లవసరము. గనుక నిల్వచేయువారు. బాబా గృహమనగా మసీదు, ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కర్రలను తీసికొని పోవువారు. అందుకు బాబా యెప్పుడును గొణుగుకొన లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శళ్యత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణ వైరాగులై నప్పటికి, సాధారణగృహస్థులకు ఆదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనములతో నున్నప్పుడెవరో యొకమేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తివ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివయిపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చినపిదప, సాయిబాబా పీల్చి యితరుల కిచ్చెడివారు. మధ్యాహ్నభోజనసమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడేబాబా పోవునపుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేల యని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయివద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించు కొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను, కాని వాడలోనుండి త్వరగా రాలేదు. తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బాహ్మణకుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించుపనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలసిద్ధపడుచుండెనని యంద రాశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురు చూచుచుండెను. బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.” అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ‘ఆగు’ మనెను. “ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా?” యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియె. “నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మా కింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము.”

బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ‘తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ యధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు – 1. ఉత్తములు 2. మధ్యములు. 3. సాధారణులు.

గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకమువారు, అడుగడుగునకు తప్పులు చెయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు.

శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మికపరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసములను బంధించుటగాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధనలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవితపరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

వచ్చే అధ్యాయములో బాబా గారి హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందుము.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

ఇరువదిరెండవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

                                    శ్రీ

                     సాయిబాబా జీవిత చరిత్రము

                                                ఇరువదిరెండవ అధ్యాయము

                                                  పామువిషమునుంచి తప్పించుట

1.బాలాసాహెబు మిరీకర్ 2.బాపుసాహెబు బుట్టీ 3.అమీరు శక్కర్ 4.హేమడ్ పంతు

సర్పములను చంపుటగూర్చి బాబా అభిప్రాయము

ప్రస్తావన

బాబాను ధ్యానించు టెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపమునుగాని అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునపుడు దూరముగానున్న చంద్రుని యాకారమొకగీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు యెడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. “నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక యాత్రాస్థల మాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత ప్రేమను, అశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని, యన్నియు గాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారియొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా, భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా యని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ వారనేక సలహాలు అవసరము ప్రకార మనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవిత మగోచరమైనది. మన మేధా శక్తికి భాషకు అందుబాటులో నుండెడెదికాదు. వారి ముఖమును జూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటయందుగాని, వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిదికాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలు సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానినిగూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వానినుండి సకాలమున బాబా యెట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలా సాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలత్ దారుగా నుండెను. చితిలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. ఆతని యోగ క్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. “నీకు మన ద్వారకామాయి తెలియునా?” బాలా సాహెబునకు బోధపడక పోవుటచే అతడూరకుండెను. “నీ విప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరయితే యామె తొడపయి కూర్చొనెదరో యామె వారిని కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబరభక్తులకు తల్లి. వారిని కష్టములనుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో, వారి కష్టము లన్నియు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీప్రసాద మిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా యిట్లనెను. “నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము” ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాముపడగవలె వంచి, “అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకా మాయిబిడ్డల నేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా, ఆ సర్పమేమి చేయగలదు?” అనెను.

అక్కడున్న వారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహల పడుచుండిరి. కాని బాబా నీవిషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితళీవెళ్ళి యానందించు మనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామ కూడ తనవెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన, రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను. బాబా యిట్లనెను. “సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు.”

ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంట రమ్మనెను. శ్యామా బాబావద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముపామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామాకూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.

బాపుసాహేబు బుట్టీ

నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపు సాహెబుతో నిట్లనియె. “ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక.” ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టీ మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్దకర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్

కోపర్ గాం తాలుకాలో కొరేలా గ్రామనినాసి అమీరు శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్ళవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషదము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా యనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. ఆందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగ 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్ గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్ళు కావలెననగా, అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీని కావిషయ మేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను, పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని యారాత్రియే యచటనుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా “ఓ అబ్దుల్! నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది.” యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యమువలన, బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. (బాబా అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను.) అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

హేమడ్ పంతు (తేలు – పాము)

1. తేలు :– బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి రెండు గ్రంధములు భాగవతమును, భావార్థరామాయణమును నిత్యము పారాయణ చెయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు గూడ శ్రోత యయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించుభాగము చదువునపుడు వినువారందరు మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపయి కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్ధముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండ తన యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి తోటలో పారవైచెను.

2. పాము :– ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి. అది యెటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము

ముక్తారామ్ యను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్పవాక్కలహము జరిగెను. ముక్తారామ్ సర్పములు మొదలగు క్రూరజంతువులను చంప నవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రిసమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటిదిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను. “భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సుత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా, భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరిని రక్షించువాడు. ”
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

మూడవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

ఇరువదియొకటవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియొకటవ అధ్యాయము

1. వి. హెచ్. ఠాకూరు 2. అనంతరావు పాటంకర్ 3. పండరీ పురము ప్లీడరు - వీరి కథలు.

ఈ అధ్యాయములో హేమడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బి.ఏ.అనంతరావు పాటంకర్ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, ఆధ్యాత్మికమార్గమునకు దారి చూపును.

ప్రస్తావన

సామాన్యముగ మన గతజన్మపుణ్యసముపార్జనమువలని యదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలాకాలము మేజిస్ట్రేటుగ నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేకమంది హిందువులు పారశీకులు, ఇతర మతస్థులుపోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూనుస్, హేమడ్ పంతును అనేకసార్లు పీరుమౌలానాను దర్శించుమని చెప్పెను. కాని ఏదో కారణముచేత అతడు చూడ లేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతనివంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి, శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.

యోగీశ్వరుల వ్వవస్థ

అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమంది యోగు లనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేకచోట్ల పని చెసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తిచేసెదరు. దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు.

వి.హెచ్.ఠాకూరుగారు (బి.ఏ.)

వీరు రెవన్యూశాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వేపార్టీతో వచ్చెను. అక్కడ ‘అప్ప’ యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆయోగి నిశ్చలదాసు రచించిన ‘విచార సాగర’ మను వేదాంతగ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. “ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చెసినచో నీకోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ వొక గొప్పయోగిని యదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తుమార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు.” ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతు పై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్ కు పెద్ద యుద్యోగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయనవలన సాయిబాబాగూర్చి యనేకసంగతులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటిదినమే నానాసాహెబు షిరిడీపోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడ రమ్మని యడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను. అంతకుముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతరస్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబావద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ యధ్యాత్మికమార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూ రొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండుచేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించ వలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. అప్పా చెప్పినదంతయు నిజమే కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి యాచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని యాశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞాన మాత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంతభాగ మాతడు చదివియుండెను, గాని యాచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును.

అనంతరావు పాటంకర్

పూనా పెద్దమనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ యను వాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టిచెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయి బడి, తగిన పూజచేసినపిమ్మట బాబాతో ఇట్లనెను. నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశపురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి యైనను కలుగుట లేదు. కనుక నా పుస్తకజ్ఞాన మంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానములేని నిరాడంబరభక్తులు నాకంటేమేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టివలనను నీ చమత్కారపు మాటలవలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతికథను ఈ విధముగ చెప్పెను.

తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ (నవ విధభక్తి)

ఒకనా డొకవర్తకు డిక్కడకు వచ్చెను. అతనిముందు ఆడగుఱ్ఱము లద్ధివేసెను. అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను.

ఈ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేశదామోదర్ వురఫ్ దాదాకేల్కరు నిట్లు అడిగెను. దీని వలన బాబా యుద్దేశమేమి, అతడిట్లు జవాబు ఇచ్చెను. నాకుగూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము, నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిది యుండల లద్ది యనగా నవవిధభక్తి. అవి యేవన-1.శ్రవణము అనగా వినుట 2. కీర్తనము అనగా ప్రార్థించుట 3. స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట 4. పాదసేవనము అనగా సాష్టాంగనమస్కారమొనర్చుట 5. అర్చనము అనగా పూజ 6. నమస్కారము అనగా వంగి నమస్కరించుట 7. దాస్యము అనగా సేవ 8. సఖ్యత్వము అనగా స్నేహము 9. ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట.

ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమునందు నమ్మక ముంచి నడచుకొనినయెడల భగవంతుడు సంతుష్టిజెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు అనగా జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట యనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయుభజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడ ననుకొనుము. లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలె నవవిధభక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలె నవవిధభక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము శాంతి కలుగును.

ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, గుఱ్ఱపు లద్ది తొమ్మిది ఉండలను ప్రోగుచేసితివా లేదా యని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రధమమున తనను బాబా యాశీర్వదించవలెననియు ప్రార్ధించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని యాశీర్వదించెను. ఇది విని పాటంకర్ యపరిమితానందభరితు డయ్యెను.

పండరీపురము ప్లీడరు

ఒక చిన్నకథతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురమునుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగనే దక్షిణ యిచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కొకమూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. ప్రజలెంత టక్కరులు. వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు. చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా. ఈ టోపి (మాట) ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి గూడ ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని, యెవ్వరికి చెప్పలేదు. వాడా లోనికి వచ్చిన పిమ్మట, ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను. బాబా చెప్పివదంతయు యథార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరిని, నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్ జడ్జియగు నూల్కర్ తన యారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతిగదిలో దీనిగూర్చి వివాదము జరిగెను. సబ్ జడ్జి బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయి బాబాను నిందించిరి. నేనుకూడ అందు కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనికమీదట ఎవరిని దుషించరాదు. ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసికొనరాదు.

షిరిడీ పండరీపురమునకు మూడు వందల మైళ్ళ దూరమున నున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు, వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్య మేదియు లేదు. దగ్గర నున్నవి, దూరముగనున్నవి ప్రతివస్తువుకూడ పగటికాంతివలె వారికి తేట తెల్లము. ఎవడయిన దూరముగా గాని, దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనినిబట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.

ఇది యెక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక.

సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము కూడ అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

ఇరువదవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదవ అధ్యాయము

కాకా నౌకరిపిల్ల ద్వారా దాసుగణు సమస్య పరిష్కరించుట

ఈ అధ్యాయములో దాసుగణు సమస్య కాకాసాహెబు పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హెమడ్ పంతు, చెప్పెను.

ప్రస్తావన

మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తులకొరకాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయ యను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుము గాక. షిరిడీకి పోయి యచ్చటి మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయినపిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, గోడప్రక్కన నిలిచి ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడ సమానమయిన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి పాదములకు నమస్కరించి, బాబా వైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లు లనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదీ పోయుచు, వారి నుదుటపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తులయెడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల నీ క్రింది విధముగా పలుకరించు చుండెను. “అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము; బాబా! నీ బసకు పో; బాపూ; భోజనము చేయుము.” ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి యింటికి సాగనంపుచుండెను. ఇప్పటికి అది యంతయు ఊహించు కొన్నచో ఆ దృశ్యములను గాంచి సంతసించవచ్చును. వానిని భావనకు దెచ్చుకొని యానందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిల్పి, వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదముల పై బడి సగౌరవముగ ప్రేమతోను వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదము.

ఈశావాస్యోపనిషత్తు

ఒకప్పుడు దాసుగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీభాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము.

వేదసంహితలోని మంత్రములు గలుగుటచే దానిని మంత్రోపనిషత్తు అని యందురు. దానిలో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు ‘వాజసనేయ సంహిత’ యుండుటచే దానికి వాజసనేయ సంహితోపనిషత్తని కూడ పేరు. వైదిక సంహితలుండుటచే, దీని నితర ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు పై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు.

పప్రొఫెసరు రానడెగా రిట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్ దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 18 శ్లోకములలో, ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యముగల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన యిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింప బడిన కర్మయోగసిద్ధాంతముల ప్రతిబింబిమే యుపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగనున్న సంగతులు చెప్పబడినవి. ఈ యుపనిషత్తులోని సారాంశమేమన జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొకచోట వారిట్లనిరి. ‘ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము’.

పైవర్ణముబట్టి యీ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట యెంతకష్టమో గమనించవచ్చును. దాసుగణు దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసినదానితో నతడు తృప్తి చెందలేదు. కొందరు పండితుల నడిగెను. వారితో చర్చించెను. కాని, వారు సరియైన సమాధాన మియ్యకుండిరి. కావున దాసుగణు కొంతవరకు వికలమనస్కు డయ్యెను.

సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు

ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది యాత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక నెవరయితే యాత్మసాక్షాత్కారము పొందియున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్ప గలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనపుడు దాసుగణు సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి, వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల జెప్పి, సరియైన యర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను. “నీవు తొందర పడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగుప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును.” అప్పుడక్కడ నున్న వారు దీనిని విని, బాబా తమాషా చేయుచున్నారని యనుకొనిరి. భాషాజ్ఞానములేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగల దనిరి. కాని దాసుగణు ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కు లనుకొనెను.

కాకా యొక్క పనిపిల్ల

బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసుగణు షిరిడీ విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బసచేసెను. ఆ మరుసటిదిన ముదయము దాసుగణు నిద్రనుంచి లేవగనే యొక బీదపిల్ల చక్కనిపాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము యెఱ్ఱచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని యంచులు చివరలు చాల సుందరముగా నుండెననియు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల, ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి, దాసుగణు ఆమెపై జాలిగొనెను. ఆమరుసటిదినము రావు బహద్దర్ యమ్. వి. ప్రధాన్ తనకు దోవతులచావు లివ్వగ, ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావుబహద్దుర్ యొక మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను. ఆకలితో నున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానందపరవశురాలయ్యెను. ఆ మరుసటిదిన మామె యా క్రొత్తచీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె తాను బాగుగ ఆడి పాడెను. మరుసటిదినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని వచ్చెనుగాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగణు జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్తచీర గలదు, గాని, దానిని పెట్టెలో దాచు కొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునదిగాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఃఖములను మనోభావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమునుగూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతు డిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడిమనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించిన దంతయు మన మేలుకొరకే యని గ్రహించెను. ఈ ప్రత్యేకవిషయములో ఆ పిల్లయొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్తచీర, దాని నిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము – ఇవి యన్నయు భగవంతుని యంశములే. భగవంతుడు ఈయన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచట దాసుగణు ఉపనిషత్తులలోని నీతిని, అనగా ఉన్న దానితో సంతుష్టిచెందుట, ఏది మనకు సంభవించుచున్నదో – యది యెల్లయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్న దనియు, తుదకది మన మేలుకొరకేయనియు గ్రహించెను.

విశిష్టమైన బోధన విధానము

పై కథనుబట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైన దనియు అపూర్వమైనదనియు గ్రహించును. బాబా షిరిడీని విడువనప్పటికి, కొందరిని మఛీంద్రగడ్ కు; కొందరిని కొల్హాపూరుకు గాని, షోలాపూరుకు గాని సాధననిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్తలోను, అది రాత్రిగాని పగలుగాని, కాన్పించి కోరికలు నెరవేర్చు చుండెను. భక్తులకు బాబా బోధించుమార్గములు వర్ణింప నలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసుగణును విలీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలీపార్లే పంపకుండ షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొంద రనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల, యామె చీరకూడ, భగవంతునిచె వ్యాపింప బడియున్నదని దాసుగణు ఎట్లు నేర్చుకొని యుండును?

ఈశావాస్యోపనిషత్తులోని నీతి

ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్యవిషయము అది బోధించు నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి యని చెప్పుచున్నవి. దీనినిబట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతు డిచ్చినదానితో సంతుష్టిచెందవలెను. ఏలయన భగవంతుడన్ని వస్తువులయందు గలడు. కావున భగవంతు డేది యిచ్చెనో అదియెల్ల తన మేలుకొరకే యని గ్రహించవలెను. దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దాని నిచ్చియున్నాడనియు, కావున నది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పుడేదోతనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుటవలన వైష్కర్మ్యాదర్శనము పొందును. ఏమానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ యన్నిటియం దుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకలవస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకలవస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్తమాత్మయగునో, వానికి మానవులు పడు సామాన్యబాధలతో సంబంధము లేదు. అనగా నతడు కష్టములకు మార్పుజెందడు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

18, 19 అధ్యాయములు

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

18, 19 అధ్యాయములు

హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి యాశీర్వదించెను?

సాఠేగారి కథ; దేశ్ ముఖ్ గారి భార్యకథ; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిజూపుట; ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి.

గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా యెట్లు ఆదరించెనో హేమడ్ పంతు వర్ణించెను. ఈ వచ్చే రెండు అధ్యాయములలో హేమడ్ పంతును బాబా యెట్లు ఆమోదించి యాశీర్వదించెనో, బాబా యెట్లు మంచి యాలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందా వాక్యములగూర్చి, కష్టమునకు కూలి మొదలగు వానిగూర్చి, బాబా వారి ప్రబోధలెట్టివో వర్ణింతుము.

ప్రస్తావము

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపుననువిషయ మందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించుదాని నితరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనము లగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్ష కాలపు మేఘమువంటివారు. వారు తమ యమృతతుల్యము లైన బోధలు పుష్కలముగా విశాలప్రదేశములందు కురిపెదరు. వానిని మన మనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన 'రామరక్షాస్తోత్రము' ను బుధకౌశిఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట దెలిపెదము.

ప్రేమగల తల్లి, గుణమిచ్చుచేదైన యౌషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయునట్లు, ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది. వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి యాత్మయొక్క దైవీసౌందర్యములను జూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని సేవించి, వారి ప్రేమనుపొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలగించి, మనల సంతోషపెట్టును. ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయమువలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ యధ్యాయములోని ముఖ్యకథను ప్రారంభించెదము.

సాఠేయనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. ఇంక మరికొన్ని విషయము లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచార గ్రస్తుడయ్యెను; విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లువిడచి చాలా దూరము పోవలె ననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా నిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వతబ్రహ్మవలె స్వయంప్రకాశుడై, నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యమువలన బాబా యెక్క పవిత్రమయిన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తికాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను; బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటివారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యనుకొనెను. ఆ మరుసటిదిన మాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము చేయవలెనో కనుగొను మనెను. సమయము దొరికినప్పుడు కాకా సాహెబు బాబాను ఇట్లడిగెను. "ఓ దేవా! యీ దృశ్యమువలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు; అతని కోరిక నెరవేర్చవలెను అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు" డనిన, బాబా "అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో, నాతడు పావనుడగును; మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధములనుండి తప్పించును." అనెను.

ఆ సమయమున హేమడ్ పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లను కొనెను. "సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా! నేను నలుబది సంవత్సరములనుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదా! అత డిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా యేమి? చాతక పక్షి మేఘమునుంచి పడు నీటిబిందువుకై కని పెట్టు కొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను." ఈ యాలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి యాలోచన లన్నియు బాబా గ్రహించెడివారు. అంతయేగాక, చెడ్డ యాలోచనలను అణచుచు, మంచి యాలోచనలను ప్రోత్సహించువారు. హేమడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామావద్దకు పోయి అతనివద్ద 15 రూపాయలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయ మయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాట గలవారెవరు?

హేమడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు వచ్చెను. అప్పుడే యతడు స్నానము చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమడ్ పంతు నిట్లడిగెను. "మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ యేలయున్నారు? మీరు మసీదునుండి వచ్చుచున్నట్లున్నదే! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు? మీరొంటరిగా వచ్చినారేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడెదము." ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమడ్ పంతు ముందర వసారాలో గూర్చొనెను. కిటికీలో 'నాథభాగవత' మను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము 'భావార్థ దీపిక' లేదా జ్ఞానేశ్వరి, (శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమయిన) ఏకనాథభాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునపుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమడ్ పంతు కూడ నిత్యము నాథభాగవతమును పారాయణము చేయువాడు.

ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలోనున్న నాథభాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తిచేయుటకే కాబోలు బాబా యచ్చటకు పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తిచేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమడ్ పంతు:- నేను బాబా వద్ద నుండియొక వార్త తీసికొని వచ్చినాను. నీవద్దనుండి 15 రూ దక్షిణ తీసికొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి యున్నారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని యన్నారు. శ్యామా:- (ఆశ్చర్యముతో) నావద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగనమస్కారములు డబ్బునకు బదులుగా తీసికొని బాబా వద్దకు వెళ్ళుము. హేమడ్ పంతు:- సరే నీ నమస్కారము లామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడు కొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును, కథలును చెప్పుము. శ్యామా:- అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని (బాబా) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరివాడను. నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే యీ తమలపాకులు, వక్క, సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్లనియెను. "ఈ భగవంతుని (బాబా) లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతులేదు. వాని నెవరు గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వానినంటునట్లు కాన్పించరు. మావంటి జానపదుల కేమి తెలియును? బాబాయే యీ కథల నెందుకు చెప్పరాదు? మీవంటి పండితులను మూర్ఖునివద్ద కేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను." ఈ యుపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను. 'నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నా కది స్వయముగా తెలియును.' భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో; బాబా యంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినపరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. (ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము.)

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండు ననుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్

రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాభా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనో నిశ్చయము చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదెశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడుదినములవరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. "దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశ మివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెనుకరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము". ఆమె మనో నిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.

"ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసేవ చేయుటకు, వారివద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండు పైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని. "మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులు 1. దృఢమైన విశ్వాసము 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని, వారు సంతోషించిరి.

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకుగాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్ప వచ్చును. నేను దాని నెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు, వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియిందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి (ఓపిక) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుషలక్షణము. అది పాపము లన్నిటిని తొలగించి, భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గణి, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ (నమ్మకము), సాబూరి (ఓపిక) అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్రవంటివారు.

నా గురువు నానుండి యితర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువుదృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్ర మెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువు నందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) యవతారమని యెంచెదరో వారే ధన్యులు."

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యాముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను.

ఈ కథను జాగ్రత్తగాను, శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి, హేమడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామా అతని నీస్థితిలో జూచి "ఏమి జరిగినది; యేల యూరకున్నవు? అట్టి బాబా లీలలు నీ కెన్ని వర్ణింపవలెను?" అని యడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు భాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెదననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను. బాబా యిట్లనెను. "సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీ రేమి మాట్లాడితిరో చెప్పుము." గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని, లెక్కించక హేమడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాల ఆనందము కలుగ జేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు ఆ కథరూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా యిట్లనియె. "కథ చాల అద్భుతమైనది. నీ వెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము." అప్పుడు హేమాడ్ పంతు తానింతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి. యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. "ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?" యని బాబా హేమాడ్ పంతు నడిగెను. "అవును బాబా! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని" అని హేమాడ్ పంతు బదులిచ్చెను.

బాబా యిట్లు చెప్పెను. "నా పద్దతి మిక్కిలి విశిష్ఠమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నియును శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీచేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే." బాబా యీ మాటలు పూర్తిచేయుసరికి, హారతి పూర్తియాయెను. అందరు 'శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై' యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా! యీ సమయమందు మనముకూడ మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులతో పాల్గొందుము.

హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చెతిలో పెట్టి యిట్లనెను. "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు." హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి "ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము, కాపాడుము." అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "ఈ కథను వినుము. దీనిని మననము చేయుము. ఇది ధ్యానము చేయుము. అట్లయనచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను."

ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబాకృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు.

19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని యితర విషయములను జెప్పియున్నారు. అవి యీ దిగువ పొందుపరచితిమి.

మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము

ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవయినప్పటికి అమూల్యములు, వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో, నవి మనకు మేలుజేయును. "ఎదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొఱకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నీశ్చయముగా నీకు సంతోషము కులుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీ వున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు, 'అల్లా మాలిక్' భగవంతుడే సర్వాధి కారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గ మసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొన వీలు లేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖఃముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు."

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట

సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసి కొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్యశరణాగతి చేసినచో వారు నీ కెట్లు పదేపదే సహాయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగనే నీ కేమయిన మంచి యాలోచన కలిగిన, తరువాత పగలంతయు దానిని పృద్ధిచేసినచో నీ మేధాశక్తి వృద్ధిపొందును, నీ మనస్సు శాంతిపొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించ దలచెను. ఒక బుధవారము రాత్రిపండుకొనేటప్పు డిట్లనుకొనెను. రేపు గురువారము శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసికొని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బుట్టీవాడా దాటుచుండగా ఒక చక్కని పాటవినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడినపాట 'గురు కృపాంజన పాయో మేరే భాయి' యనునది. గురువు కృపయను అంజనము లభించెననియు దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీరాముని లోన, బయట, నిద్రావస్థలోను, జాగ్రదావస్థలోను, స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పెడుపాట యది. అనేక పాటలుండగ బాబా భక్తుడగు ఔరంగాబాదునివాసి యీపాట నేల పాడెను? ఇది సందర్భానుసారముగ బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు గావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యా పాటను పాడించియుండును.

రామనామస్మరణ ఫలితముగూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టములనుండి కాపాడును.

ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్చి బోధ

ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేకస్థలముగాని, ప్రత్యేక సమయముగాని యక్కరలేదు. ఏదైన యవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్ల వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తునిగూర్చి పరోక్షమున ఇతరులముందు నిందించు చుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పుల నెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్న వారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొకవిధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేకమార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒకవిధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు గావున తిట్లుబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండీతోటకు బోవునప్పుడు మిట్టమధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను. "చూడుము! ఈ పంది కసుపును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునేతిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా?" భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను.

ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు చుండెడివారు. ఈ యుపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. "నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడ బువ్వ పుట్టును." ఇది భోజనము, వస్త్రములగూర్చి చెప్పినది. ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంతకృషి చేసిన నంతమేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా మూడున్నర మూరల శరీరమని యనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైన సర్వస్యశరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో, చక్కెర-తీపి, కెరటములు-సముద్రము, కన్ను-కాంతి, కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకలనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు భాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తనకర్తవ్య కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతరవిషయము లేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడుమనెను. 'తానెవరు' అనుదానిని తెలిసికొనగోరువారికి శ్రవణమును, మననమును చేయుమని సలహా నిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదములవద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబామందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు; అడ్డు లేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు; కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి, ఛాతీ పైన కూర్చొని, దానిని నొక్కివేసి యెన్నడు త్రాగనని వాగ్దానము చేసినపిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో 'గురుబ్రహ్మాది' మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను జెప్పుట కలవి గాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో నొకటి.

కష్టమునకు కూలి

ఒకనాడు మిట్టమధ్యాహ్నము బాబా, రాధాకృష్ణమాయి యింటిసమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోడంకర్ యింటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్కదిగెను. బాబా యభిప్రాయమేమో యెవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. అమె జ్వరమును తొలగించుటకై బాబా యిట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా రెండు రూపాయలు నిచ్చెన తెచ్చినవాని కిచ్చెను. ఎవడో ధైర్యముచేసి నిచ్చెన తెచ్చినంతమాత్రమున వానికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొక రుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా వని చేయును. పని చేయించేవాడు, పని చేసేవారలుకూడ సుఖఃపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
18, 19 అధ్యాయములు సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

16, 17 అధ్యాయములు

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

16, 17 అధ్యాయములు

(మూడవ రోజు పారాయణ - శనివారము)

బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట

గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కు నెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిమి. ఆ కథలో ఏ కొంచమైనను భక్తి ప్రేమలతో నిచ్చినదానిని ఆమోదించెదననియు గర్వముతోను, అహంకారముతోను, ఇచ్చిన దానిని తిరస్కరించెదననియు బాబా నిరూపించెను. బాబా పూర్ణ సత్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురుసాయికంటె నుదారస్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు, వారికి సమానము కావు. మనము కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు. ఏలన, యవి మనము కోరునవి మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట చెప్పుదును.

సకలైశ్వర్యముల ననుభవించుచున్న ధనికు డొకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వాని కనేక మంది సేవకు లుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపై బడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. స్నేహితుడిట్లనెను. "బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైనపని గాదు. ముఖ్యముగా నీవంటి పేరాశగల వానికి మిగుల దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునపుడు నీ కోరిక నెరవేర్చువారెవరు?"

తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీ వచ్చెను. మసీదుకుపోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి యిట్లనెను. "బాబా! ఇక్కడకు వచ్చినవారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనింతదూరమునుండి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును". బాబా యిట్లు బదులు చెప్పెను. "నా ప్రియమైన స్నేహితుడా! ఆతురపడవద్దు. నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను. నా బేరమంతయు నగదే కాని, యరువు కాదు. అనేకమంది నావద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని యడుగువారు చాల తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థికమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీవంటివారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగుసమయము శుభమైనది; శ్రేయదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నిటిని జూపెదను."

ఇట్లని బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని బిలచి నందుమార్వాడి వద్దకు బోయి 5 రూ. బదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగివచ్చి, నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి యున్నదనియు చెప్పెను. కిరాణదుకాణుదారు బాలావద్దకు పోయి యప్పు తెమ్మని బాబా యనెను. ఈసారి కూడ కుర్రవాడు వట్టిచేతులతో తిరిగివచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను.

సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మవతారమేయని మనకు తెలియును. అయినచో 5 రూ.లు అప్పు చేయవలసిన యవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపి యుందురు. ఆ పెద్దమనిషి వద్ద నోటులకట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్దనుండి బ్రహ్మజ్ఞానము కావలసి యున్నచో, బాబా యంత ప్రయాసపడుచున్నప్పు డత డూరకనే కూర్చుండడు. బాబా యా పైకమును తిరిగి యిచ్చివేయునని కూడ వానికి తెలియును. అంత చిన్నమొత్తమయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట! నిజముగా బాబయందు భక్తిప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకునివలె ఊరకే చూచి యండడు. ఈ పెద్దమనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞాన మివ్వుమని చీకాకు పరచుచుండెను. అప్పుడు బాబా యిట్లనెను. "ఓ స్నేహితుడా! నేను నడుపుచున్నదాని నంతటిని గ్రహించ లేకుంటివా యేమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై యిదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయ మిది. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన :- 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుధ్ధి; 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది."

అట్లనుచు బాబా యీ విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి.

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత

అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక
ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనకు జూచుట)
మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.

4. పాపవిమోచన పొందుట
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి
ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట
మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము
ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యునివైపు తిరిగి "అయ్యా ! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్ల రూపముతో నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము". అనెను, ఆ పెద్దమనుష్యుడు తన జేబునుంచి నోటులకట్టను బయటకు దీసెను. లెక్క పెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞత్వమును జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపై బడి వారి యాశీర్వదమునకై వేడెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ బ్రహ్మపు నోటులకట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై యున్నదో, వాడా యభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లుపొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఖఃమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంకారమను మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి.

ఎక్కడ పేరాశగలదో యక్కడ బ్రహ్మముగూర్చి యాలోచించుటకు గాని ధ్యానమునకుగాని తావులేదు. అట్లయినచో పేరాశగల వాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని, సంతుష్టిగాని, దృఢనిశ్చయముగాని యుండవు. మనస్సునం దేమాత్రము పేరాశ యున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.

ఎవడయితే ఫలాపేక్షరహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్పచదువరి యైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియ విషయములగూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను."

ఒక యతిథిని ఇంటికి బిలిచినప్పుడు, ఇంటిలోనివారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులుగూడ అతిథితోపాటు విందులో పాల్గొందురు. కావున నప్పుడు మసీదులో నున్న వారందరు బాబా ఆ పెద్దమనుష్యునకు చేసిన యీ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును పెద్దమనిషితోసహ, మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవారై వెళ్ళిపోయిరి.

బాబావారి వైశిష్ట్యము

అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, ఆశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యముగాని, మోక్షమునుగాని సంపాదించుటకు ప్రయ్తత్నించెదరు. వారితరులగూర్చి యాలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులుగాని లేరు. అయినప్పటికి సమాజములోనే యుండెడివారు. బాబా నాలుగయిదిండ్లనుండి భిక్షచేసి, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనెడివారు. లౌకిక విషయములందు మగ్నులై, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో జనులకు బోధించెడువారు. ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజల క్షేమమునకై పాటుబడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. సాయిబాబా ప్రజలకై పాటుబడు వారిలో ప్రథమగణ్యులు.

కనుక హేమడ్ పంతు ఇట్లు చెప్పెను, "ఏ దేశమునందు ఈ యపూర్వమైన విలువగల పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము. ఏ తల్లి దండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
16, 17 అధ్యాయములు సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।